Monday, November 11, 2013

వ్యూహాత్మక మౌనం


 తెలంగాణా. రాష్ట్రంలో ఏ పార్టీ బతకాలన్నా... ఈ అంశాన్ని మింగడమో, కక్కడమో చేయాలి. మధ్యే మార్గంగా ఉంటే ఫలితం శూన్యం. అయితే తెలంగాణా రాష్ట్రమే లక్ష్యమంటున్న టీఆర్‌ఎస్‌... నిర్ణయాత్మక తరుణంలో ఎందుకు మౌనం వహిస్తోంది. అసలు కాంగ్రెస్‌ ఇచ్చే తెలంగాణా వల్ల టీఆర్‌ఎస్‌కు ఉపయోగం ఉంటుందా? రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ ఎన్నికలు ముగిస్తేనా మంచిదా? తెలంగాణా కోరుకునే రాజకీయేతర ఉద్యమకారుల మాటెలా ఉన్నా.. టీఆర్‌ఎస్‌ వ్యూహం, లక్ష్యం మరోలా ఉండే అవకాశం ఉందా?

2004 ఎన్నికల మేనిఫెస్టో నుంచి 2014 సీజన్‌ ముగింపువరకూ కాంగ్రెస్‌ తెలంగాణాను బంతాట ఆడింది. రేపుమాపు అని సాకులు చెబుతూ పదేళ్లు నెట్టుకొచ్చింది. ఇక తాజా ఎన్నికలకు ముందు ఏదో నిర్ణయం తీసుకోక తప్పనిస్థితిలో.... సీడబ్ల్యూసీ తీర్మానం చేసి రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసింది. ఇది మొదలు, సీమాంధ్ర గొడవలు... పార్టీల్లో చీలికలు, రోజుకో రభస, పూటకో మాట సర్వసాధారణమయ్యాయి. వీటిని చాలా దగ్గరగా పరిశీలిస్తున్న టీఆర్‌ఎస్‌ ఇప్పడు వ్యూహాత్మక మౌనం వహిస్తోంది. తెలంగాణా ప్రకటన వచ్చినా.. సంబరాలు ఇప్పుడు కాదు పార్లమెంటు ఓకే చేశాక మాత్రమే అంటూ బ్రేక్‌ వేసింది. ఆ తర్వాత వచ్చిన రాష్ట్రం వెనక్కిపోకుండా, సీమాంధ్రకు దీటుగా పల్లెల్లో బస్సు యాత్రకు సిద్ధమైంది. కానీ, తేదీ ప్రకటించినా కేసీఆర్‌ బస్సు యాత్ర మాత్రం ముందుకుసాగనేలేదు.
ఓవైపు అంటోనీ కమిటీ, కేంద్ర మంత్రుల కమిటి, టాస్క్‌ఫోర్స్‌  కమిటీ.. ఇలా ఆయా కమిటీలతో కేంద్రం పనిని వేగవంతం చేసినట్లు కనిపిస్తున్నా... టీఆర్‌ఎస్‌లో అదే మౌనం. అప్పుడప్పుడు షరతులు లేని తెలంగాణా కావాలన్న మాటలు తప్ప... తమ వంతుగా సరైన విధివిధాలను కేంద్రానికి సూచించిన దాఖలాలులేవు. జీఓఎంకు ఇచ్చిన నివేదిక కూడా కొత్త సీసాలో పాతసారానే అన్న చందంగా ఉంది.
వాస్తవానికి టీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు.. తెలంగాణానే  లక్ష్యమైనా కాంగ్రెస్‌ చేతి నుంచి దాన్ని పొందడం వల్ల ఉపయోగాలు అంతంతమాత్రమే. కాంగ్రెస్‌ తెలంగాణా ఇవ్వదు, ఇవ్వలేదన్న ధైర్యంతో గతంలో విలీనం ప్రకటన చేసిన కేసీఆర్‌ ఇప్పుడు మాట మార్చాల్సిన పరిస్థితి. మొన్నమీద్య పార్టీ నేతలు ఈటెల రాజేందర్‌, హరీష్‌రావు, ఆ తర్వాత కేసీఆర్‌ మైకులు పెట్టి... రాష్ట్ర పునర్‌నిర్మాణంలో టీఆర్ఎస్‌ ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే విలీనం అన్నది కల్లే. మాటమారుస్తున్నారన్న విమర్శలు రావడంతో  కేసీఆర్‌ మళ్లీ పాతపాట పాడారు. ముందు బిల్‌ పాస్‌ చేయండి, విలీనం గురించి తర్వాత ఆలోచిద్దామంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అనుకున్నట్లుగా రాష్ట్రం ఇచ్చేస్తే, టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలి. లేదంటే మాట తప్పారన్న మచ్చకు సిద్ధంగా ఉండాలి.
 ఇక, కాంగ్రెస్‌.. తెలంగాణా ఇచ్చినా.. ఇచ్చింది మేమే అని చెప్పుకోకుండా ఉండదు. టీఆర్‌ఎస్‌ ఎంత సొంత ఘనతగా చాటుకున్నా... కాంగ్రెస్‌ కూడా ఇదే ఆయుధంతో ఎన్నికల్లోకి వెళ్లకపోదు. కాబట్టి ఉద్యమపార్టీకి క్రెడిట్‌లో కోత తప్పదు.
పైగా... రాష్ట్రం ఏర్పాటైతే పునర్‌నిర్మాణం అనే మాట తప్పితే, టీఆర్‌ఎస్‌కు పెద్దగా లక్ష్యాలేమీ లేవు. పైగా... కొత్తరాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అన్న మాటను నిలుపుకోవాలంటే మాటవినే దళితుడు కేసీఆర్‌ చేతిలో ఉండాలి. కనుచూపుమేరలో అలాంటివారు ఇప్పుడెవరూ లేరు. ఎవరికిపడితే వారికి ముఖ్యమంత్రి పీటం కట్టబెట్టే సీన్‌ అస్సలేలేదు. 
అదే కాంగ్రెస్‌ హయంలో తెలంగాణా రాకపోతే, 2014- టీఆర్‌ఎస్‌కు బాగా కలిసొస్తుంది. మిగతావన్నీ మర్చిపోయి సగటు పౌరుడి నోట్లో నానుతున్న తెలంగాణాను, కాంగ్రెస్‌ ఊరించి ఉసూరుమనిపిస్తే.. తెరాస ఎన్నికల్లో బాగా రాణిస్తుంది. ఇప్పుడున్న స్థితికంటే మెరుగుపడి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలచుకోవచ్చు. 
 ఇక ఇటు ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తోంది. సర్వేలు కూడా సెంట్రల్‌లో తదుపరి అధికారం బీజేపీదే అని చాటుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్‌ తెలంగాణా ఇవ్వకపోయినా, అధికారంలోకి రాగానే బీజేపీ ప్రకటిస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టి.. ఈ ఎన్నికల వేళ తెలంగాణా అందిపుచ్చుకోకపోవడమే TRS కు బెటర్‌ అన్న వాదం ఉంది. పైగా.. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం ప్రకటించే నాటికి టీఆర్‌ఎస్‌ చేతిలో ఎక్కువ ఎంపీ స్థానాలుంటాయి కాబట్టి  కేంద్రంలో కీలకస్థానం పొందచ్చు. ఇక కమలనాథులతో విలీనం అన్న ఊసే లేదు కాబట్టి.. పార్టీ పార్టీగానే ఉంటుంది. నాయకులకూ జాతీయ స్థాయి హోదా దక్కుతుంది.   2019 వరకూ పార్టీకి గానీ, నాయకులకు గానీ ఎలాంటి డోకా ఉండదు. రాష్ట్రంలో అధికారం గురించి ఆలోచించాల్సిన అవసరమూ రాదు...
 వెరసి... టీఆర్‌ఎస్‌కు తెలంగాణా ముఖ్యం. దానితోపాటే భవిష్యతు రాజకీయ అవసరాలు ముఖ్యం. అందుకేనేమో... బీజేపీ GOM నోట్‌కు ముందు సీమాంధ్ర మెలిక పెట్టినా.. ఒక్క మాట అన్న పాపన పోలేదు. ఈ రాజకీయ చదరంగంలో తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకుంటున్న అసలు సిసలు తెలంగాణా వాదులు, అందునా యువకులు పావులుగా మారబోతున్నారనడంలో సందేహంలేదు.  

Wednesday, October 30, 2013

అఖిలపక్షం.. అశనిపాతమే... !

                                అఖిలపక్షం.. అశనిపాతమే


రాష్ట్రంలో కొత్త రాజకీయ వాతావరణానికి కేంద్రం తలుపులు తీసింది. మరోసారి తెలంగాణ రాష్ట్రంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాన్ని గుర్తుచేసింది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ఇరకాటంలో పెట్టేందుకే కాంగ్రెసు అధిష్టానం సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందా లేదంటే రాజకీయ ప్రయోజనాలు కానరాని పరిస్థితుల్లో విభజన ప్రక్రియను సాగదీస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం... అనూహ్యంగా ఓ ట్విస్ట్‌ ఇచ్చింది.  మరోసారి అఖిల పక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర విభజన కోసం ఉద్దేశించిన 11 విధి విధానాలపై రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీల నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకోవాలని యోచిస్తోంది . అయితే, ఈ నిర్ణయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంత వ్యతిరేకత ఓవైపు, రంగుమార్చిన పార్టీల నైజం మరోవైపు కనిపిస్తుండడంతో రాజకీయ ప్రయోజనాలు ఆశించినంతగా ఉండవనే విషయాన్ని కాంగ్రెస్‌ గుర్తించింది. ముఖ్యమంత్రి సహా కీలకంగా ఉన్న సొంత పార్టీ నేతల మెడపైనే కత్తిపెట్టి తెలంగాణా ఇవ్వడం వల్ల ఒరిగే లాభాలేమని పసిగట్టిన కాంగ్రెస్‌.. వైసీపీపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్ల కనిపిస్తోంది. మొన్నటికి మొన్న సమైక్య సభలో జగన్‌.. మాటతీరు సోనియాపై ఉన్న వ్యతిరేకతను కళ్లకుగట్టింది. ఇటు తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ కూడా విలీనంపై మాట దాటేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు కుదరకపోయే అవకాశం సుస్ఫష్టం. ఒకవేళ జతకలిసినా... అది పక్కలోబల్లమే. దీంతో తెలంగాణాను ఇస్తామనే మాట చెబుతూనే, ప్రక్రియను సాగదీసే పనిలో పడింది కేంద్రం.


ఇక తాజా అఖిలపక్ష నిర్ణయంతో వైసీపీ, టీడీపీల పరిస్థితి ఇరకాటంలో పడింది. మొదట్నుంచి సమైక్య రాగం వినిపిస్తున్న వైసీపీ ... ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై చర్చలు ప్రారంభించింది. వైయస్ జగన్ వినిపిస్తున్న సమైక్యవాదంలో పెద్ద లొసుగే ఉంది. మొదట సమన్యాయం అని, ఆ తర్వాత సమైక్యవాదమని చాటిన జగన్‌ ఇప్పుడు సమైక్య రాష్ట్రమే ఉన్నా కూడా తెలంగాణాని వదులుకుంటారా అనేది తేలాల్సిన విషయం. మరోమాటలో చెప్పాలంటే... సమైక్య ముసుగులో సీమాంధ్రకు గాలం వేసిన జగన్‌కు అఖిల పక్షం అశనిపాతమే.


ఇక టీడీపీకైతే కేంద్ర నిర్ణయం కోలుకోలేని దెబ్బ. విభజనపై ఏం మాట్లాడాలో తెలియక మొదట్నుంచి విభజన తీరును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు తాజా బేటీలో కచ్చిత వైఖరి కనబరచాల్సి ఉంది. ఓవైపు గతంలో ఇచ్చిన విభజన అనుకూల లేఖ, మరోవైపు సీమాంధ్ర సెగ... వెరసి, టీడీపీకి ఇప్పుడిది తేలని సమస్య.
తెలంగాణను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం లేఖలు ఇస్తే తెలంగాణలో ఆ పార్టీలకు ఏ మాత్రం చోటు ఉండదు. ఆ విషయం తెలిసిన ఆ పార్టీల అధినేతలు అటువంటి సాహసానికి ఒడిగట్టకపోవచ్చునని అంటున్నారు. అయితే, సమైక్యాంధ్ర కోసం జగన్ లేఖ ఇస్తారేమో గానీ చంద్రబాబు మాత్రం ఇచ్చే అవకాశాలు లేవు. జగన్ కూడా సమన్యాయం షరతు పెట్టి మాత్రమే లేఖ ఇచ్చే అవకాశమూ లేదన్నది విశ్లేషకుల భావన.  

                                                                            - రాజేష్ పొట్లూరి

విషాద సంచిక

                                       విషాద సంచిక

 పండగలకు ఊరు వెళ్లాలనుకుంటున్నారా? ట్రావెల్స్‌లో టికెట్స్ కూడా బుక్ చేయించారా..? అయితే జాగ్రత్త. బయలుదేరేముందు ఒక్కసారి మీ భద్రత గురించి ఆలోచించండి. 
 రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే.. అందులో 80శాతం ప్రైవేట్ వాహనాల ఖాతాలోనే చేరుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రమాదాలన్నీ కలిపి రోజూ కనీసం అరడజను ముంది ఉసురుతీస్తుంటే... ప్రైవేటు ట్రావెల్స్‌ ఘటన జరిగిన ప్రతిసారి పది నుంచి 50మంది వరకూ మృత్యువాత పడుతున్నారు.
మొన్నటికి మొన్న.... షిర్డీ వెళ్తూ కాళేశ్వరి ట్రావెల్స్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో... అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది. దిగ్బ్రాంతి కలిగించిన ఈ ఘటనలో ముప్పై మందికి పైగా మృత్యుఒడికి చేరారు. బతికి బట్టకట్టిన వారిలో కూడా చాలమంది శరీరఅవయవాలను కోల్పోవాల్సి వచ్చింది.
... ఈ విషాదం తాలూకు ఆనవాళ్లను పూర్తిగా మరచిపోకముందే మరో దారుణ ఉదంతం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న జబ్బర్‌ ట్రావెల్స్‌ బస్సు... నిట్టనిలువునా అగ్నికి ఆహుతైంది. 51మంది బస్సులో ఉంటే... 45మందిని సజీవం దహనం చేసింది. బతికినవాళ్లలో డ్రైవర్‌, క్లీనర్‌ సహా.. మరో నలుగురు ముందు కాబిన్‌లో ఉన్నవాళ్లే.
                                                                         అసలు, ఈ ఘటనకు కారణాలేంటి?
 అరకొర ప్రమాదాలు తగలపడుతున్న జబ్బర్‌ ట్రావెల్స్‌ బస్సు
తప్పితే, వందలమందిని ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంటే... ప్రైవేటు ట్రావెల్స్‌లో వెళ్లేవారికి మాత్రం ఈ గతేంటి? ఇప్పుడిదే ప్రశ్న. వాస్తవానికి ఆర్టీసీతో పోల్చితే ప్రైవేటు వాహనాలకు డబ్బు ఆశ అధికం. ఇదే కొంప ముంచుతోంది. పర్మిట్‌ లేని రూట్లలో, ఫిట్‌నెస్‌ లేని బస్సులు రోడ్డెక్కి మారణహోమం సృష్టిస్తున్నాయి. సాధారణంగా పదుల సంఖ్యలో ప్రయాణికులను ఓ బస్సు మోసుకెళ్తుందంటే... ఆ డ్రైవర్‌ ఎంతో సాహసం చేస్తున్నట్లే లెక్క. వారందరూ తమ ప్రాణాలను నమ్మకంగా  డ్రైవర్‌ చేతిలో పెట్టినట్టే. అలాంటి సారథి ఎలా ఉండాలి. ?
..సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో అయితే, వాహన చోదకులకు శిక్షణ ఉంటుంది. అసలు ప్రమాదం జరగకుండా పాటించాల్సిన నియమనిబంధలు వాళ్లకు కొట్టినపిండి. ఆయనా ఒకటీరెండు సార్లు నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరగొచ్చు. ఒకవేళ అలా జరిగినా... చివరి క్షణం వరకూ ప్రయాణికులను కాపాడలన్న లక్ష్యం వారికి శిక్షణతో పెట్టిన విద్య.
ఇక ప్రైవేటు ట్రావెల్స్ అయితే, డ్రైవర్‌కు లైసెన్స్‌ ఉంటే చాలన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఎంత దూరమైనా ఒక్కడే డ్రైవర్‌తో సాగనంపుతున్నాయి. గమ్యాన్ని చేరాలన్న లక్ష్యం తప్పితే, వేగం-దాని పర్యవసానాలతో పనిలేదు. తాజా ఉదంతం అదే నిరూపించింది. అతివేగంతో కల్వర్టును డీకొట్టి.. డీజిల్‌ ట్యాంక్‌ పేలడానికి నిర్లక్ష్యమే కారణమైంది. పోనీ ప్రమాదం జరగ్గానే.. వెనకాల ప్రయాణికులున్నారన్న సంగతి గుర్తుపెట్టుకుని , కనీసం... బయటికొచ్చేందుకు డోర్‌ ఓపెన్ చేయాలన్న ఆలోచన కూడా వారి బుర్రలకు తట్టలేదు.  ఆ ఫలితమే... 45మంది ప్రాణాలు.
బస్సు అందాలు, సౌకర్యంతో పాటు... త్వరగా చేరతామన్న ప్రయాణికుల ఆశ... అతి త్వరగా అనంతలోకాలకు పంపుతోంది. సాధారణంగా పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు డొక్కు బస్సులు సైతం రోడ్లెక్కుతున్నాయి. డబుల్‌ చార్జీలతో ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రమాదాలు జరిగే... నష్టం రెండింతలుండడం ఖాయం.
మరి ట్రావెల్స్‌ మాఫియాగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్న అనుమానం రావచ్చు. నిజానికి ట్రావెల్స్ నడుపుతున్న వారిలో సగం మంది రాజకీయ వేత్తలే. లేదంటే వారి బంధువులు, అనుచరలే. దీంతో ఒత్తిళ్లు పెరిగి అధికారులూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఘటన జరిగిన ప్రతిసారి మెరుపుదాడులు చేసి బస్సులను సీజ్‌ చేసినా.. మీడియాలో వార్తలు వచ్చిపోగానే.. బస్సులూ విడుదలవుతాయి.
గతంలో రవాణాశాఖ కమిషనర్‌గా పూనం మాలకొండయ్య ఉన్నప్పుడు ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆమె ఉక్కుపాదమే మోపారు. అప్పట్లో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఏకంగా ఆమె కార్యాలయానికే వచ్చి దుర్భాషలాడారు. ఆయన చెక్కుచెదరక తనపనిని తాను చేసుకుంటూ పోయారు పూనం. బెదిరింపులతో పని జరగదని తెలుసుకున్న ట్రావెల్స్‌ మాఫియా... ఆమెను ఆ స్థానం నుంచి బదిలీ అయ్యేలా చేసింది...
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఘటనకు సంతాపం చెప్పడం తప్ప, ట్రావెల్స్‌ ను కట్టడి చేయడం సర్కారుకు చేతగాని పని. కాబట్టి... ప్రయాణికులే సొంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళి వేళ... ఇతర సమయాల్లో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే చికిత్స కంటే నివారణే మేలన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.

Monday, August 26, 2013

పాఠం నేర్వని పాకిస్తాన్

పాక్‌ భారత్‌ వైపునుంచి యుద్ధమే కోరుకుంటోందా?  మనతో తలపడిన చరిత్ర నుంచి పాక్‌ గుణపాఠం నేర్చుకోలేదా? తాజా సంఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా నవాజ్‌షరీఫ్‌ ప్రధానమంత్రిత్వంలో భారత్‌తో స్నేహం సంబంధాలుంటాయన్న అందరి మాటలను కొట్టిపారేస్తూ... దాయాదిదేశం ఎందుకు దాడులకు తెగబడుతోంది. 1947 దేశ విభజన తర్వాత నుంచీ మనపై పాక్‌కు ఎందుకు అంత అక్కసు.
1947లో దేశం విడిపోయిన నాటి నుంచి.. దాయాది దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ సమస్య రెండు దేశాల మధ్య ఇప్పటికీ నలుగుతూనే ఉంది. ఈ సరిహద్దు తగదాలు కాస్తా  చినికి చినికి గాలి వానగా మారి నాలుగుసార్లు బీకరపోరుకు దారితీశాయి . స్వాతంత్ర్యం వచ్చిన రెండు నెలలకే అంటే 1947 అక్టోబర్‌లో జరిగిన తొలి యుద్ధం.. ఫస్ట్‌ కాశ్మీర్‌ వార్‌గా చరిత్రలో నిలిచింది. ఐదువారాల పాటు జరిగిన  హోరాహోరీ పోరు లో  ఇరువైపులా వందలాది మంది సైనికులు మరణించారు. చివరికి ఐక్యరాజ్యసమితి జోక్యంతో నాడు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
భారత్, పాక్‌ల మధ్య 1965లో రెండో సారి యుద్ధభే రి మోగింది.  గుజరాత్ లోని రాణా ఆఫ్ కచ్ ప్రాంతంతో పాటు భారత్‌ లోని మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు దాయాది తీవ్రంగా ప్రయత్నించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొదట పోలీసుల కాల్పులతో ప్రారంభమైన ఉద్రిక్తత, తీవ్రత పెరిగి యుద్దంగా మారింది. రెండుదేశాలూ సైనికులను రంగంలోకి దించాయి. ఈసారి దాయాదుల పోరును తీర్చే బాధ్యతను నాటి బిట్రిష్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్ సన్ తీసుకున్నారు. ఇరుదేశాలతో చర్చలు జరిపి ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేశారు. దాని తీర్పుతో గుజరాత్‌ లోని రాణా ఆఫ్ కచ్ లోని 350 మైళ్ల ప్రాంతం పాకిస్థాన్‌ వశమైంది. అయినా, పాక్‌ మాత్రం తమ భూభాగం 3వేల500 మైళ్లుందని అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.   
ఇక అదే ఏడాది ఆగస్ట్ 5న 30 వేలమంది పాక్‌ చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించారు. ఇంతమందిని వెనక్కుపంపడానికి భారత్‌కున్న ఏకైక అస్త్రం యుద్ధం. పాకిస్ధాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ పై సమరం జరిపిన భారత్ పైచేయి సాధించింది. పాకిస్థాన్‌ కూడా ధీటుగానే పోరాడి కొంత భూబాగాన్నితన వశంచేసుకోగలిగింది. ఇదే యేడాది సెస్టెంబర్లో మరోసారి పాక్‌, జమ్ముని టార్గెట్ చేసింది. ఆప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని భారతకు వచ్చే ఆయుధాలను నిలిపివేయాలని వ్యూహంపన్నింది. యుద్దట్యాంకులతో తెగబడింది. ఊహించని ఈ దాడితో భారత సైన్యానికి చేదు అనుభవం ఎదురైంది. వాయుసైనను రంగంలోకిదించి శత్రు సైన్యాన్ని చెల్లాచెదురు చేసింది .
1971 లో భారత భూభాగంలోని సియాచిన్, హిమనీ నదులు మీద పట్టుసాధించడానికి చుట్టు పక్కల ఉన్న కొండలపై పాక్ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. దీంతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. 1980 లో కాశ్మీర్ లో పాకిస్థాన్ వేర్పాటువాదం, అణుప్రయోగాల వల్ల మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వీటిని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు లాహోర్ ఓప్పందాన్ని కుదుర్చుకున్నాయి .
ఆ ఒప్పందం తర్వాత పైకి ప్రశాంతంగా ఉన్నా.. పాక్‌ లోలోపల రగులుతూనే ఉంది.  అది ముదరడంతో 1998 శీతాకాలంలో పాకిస్థాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజూహిదీన్ ల రూపంలో కాశ్మీర్‌కు పంపింది. ఈచర్యను ఆపరేషన్ బద్ర్ గా వ్యవహరిస్తారు.
ఇక ఆ తర్వాత.. జరిగిన మహా సంగ్రామం కార్గిల్ వార్. ఓ వైపు కాశ్మీర్‌కు, తమకు సంబంధం లేదని చెప్తూనే మరోవైపు నుంచి అక్రమంగా భారత్‌పై తెగబడింది పాక్.  1999లో తలెత్తిన ఈ పరిస్థితిని ఉపేక్షించని అప్పటి NDA ప్రభుత్వం పాకిస్థాన్ తో సమరానికి సై అంది. దీంతో కాశ్మీర్ లోని కార్గిల్ ప్రాంతంలో మరోసారి ఇరుదేశాల మధ్యపరోక్షంగా  భీకర యుద్దం జరిగింది.  ఈ యుధ్దం నేపథ్యంలోనే భారత్‌లోని ప్రతీపౌరుడు మనసులోని దేశభక్తిని బయటపెట్టాడు. సైనికులకు వెన్నంటి ఉండడమే కాదు... అవసరమైతే సరిహద్దులోకి వచ్చి శత్రువులను ఎదుర్కుంటామని చాటాడు. కానీ ఆ అవసరం లేకుండానే భారత్‌ సైన్యం సత్తా చాటింది. ఈ పోరులో భారత్‌కు ఘన విజయం దక్కగా.. పాక్‌ సైనికులతో పాటు, ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయింది .
ఇవే ఇప్పటివరకూ ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న యుద్ధాలు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి భారత్‌ సంయమనంగా ఉన్నా... పాక్‌ మాత్రం ప్రతీసారీ దాన్ని చేతగాని తనంగానే భావించింది. ఆ మేరకు తగిఅనుభవించింది. ఇక కార్గిల్‌ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోని వచ్చాక భారత్‌.. పాక్ వైపు కన్నెత్తి చూసింది లేదు. యుద్ధానికి ఆరాటపడిందీ లేదు. కానీ, నేటికీ పాక్‌ పాలకుల్లో, సైన్యంలో మార్పు రాలేదు.
ఒకటికాదు.. రెండుకాదు... 14ఏళ్లుగా, ఇదే తంతు. సరిహద్దుల్లో పాక్‌ నుంచి నిత్యం ఏదో ఒక కవ్వింపు చర్య. ఇటీవలికాలంలో ఈ జాడ్యం మరింత ఎక్కువైంది. గడచిన పదిరోజుల్లోనే పాక్‌ సైన్యం 12సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. అంతకుముందు... ఐదుగురు ఇండియన్‌ జవాన్లను  అత్యంత కిరాతకంగా చంపి.. బోర్డర్‌లో పడేసింది. ఏమీ ఎరగననట్లు.. మా పరిధిలో మీవాళ్ల శవాలున్నామంటూ చెప్పుకొచ్చింది. కానీ, పోస్ట్ మార్టం రిపోర్లు నిర్దారణవేరు. ఆ తర్వాతా ఆడియోవీడియో టేపుల్లో  వెల్లడైన నిజాలను బట్టి... పాక్ సైనికులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తేటతెల్లమైంది.
ఇంత జరుగుతున్నా భారత్‌ మాత్రం పాక్‌తో స్నేహపూర్వక సంబంధాన్నే కోరుకుంటోంది.  పాకిస్థాన్‌ మాత్రం ఇందుకు విరుద్దంగా భారత్‌ ను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పన్నాగాలు పన్నుతూనే ఉంది. దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇటు చైనావైపు నుంచి ఇదే తరహా చొరబాట్లు... ఎదురవుతున్నా, యుద్ధం కాదుకదా, కనీసం హెచ్చరించే పరిస్థితుల్లోనూ మన దేశ పాలకులు లేరన్నది జగమెరిగిన సత్యం. పార్లమెంటు వేదికగా చేసే తూతూమంత్రపు వ్యాఖ్యానాలు, ఖండనలు... పొరుగుదేశాల్లో భారత్‌ అంటే చులకన భావం ఏర్పడేలా చేస్తున్నాయి. 






Thursday, August 15, 2013

సౌభాగ్యప్రదం వరలక్ష్మీ వ్రతం



                                 సౌభాగ్యప్రదం వరలక్ష్మీ వ్రతం


Wednesday, August 14, 2013

Tuesday, August 13, 2013

విడిపోవడమే మేలు....




ఏ ఇద్దరి మధ్య సంబంధం కలకాలం సాఫీగా సాగాలన్నా... దానికి ఇద్దరి సఖ్యత, ఆమోదం ఉండాలి. 
మొన్నటిదాకా దంపతుల్లో ఒకరు విడిపోవాలని పట్టుబట్టి సర్దుకున్నారు. ఇప్పుడు ఇంకొకరు విడిపోవాలని పట్టుబడ్డి కూర్చున్నారు. దంపతులు విడిపోయే పరిస్థితికి వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి, తప్పోఒప్పో వాళ్లూ విడదీయడమే కరెక్ట్ డిసైడ్ అయిన తర్వాత మళ్లీ గోల వల్ల ప్రయోజనం ఏముంది.? ఒకవేళ ఏదో ఒక వర్గంవారు బెదిరించి కలిసి ఉండాలని తాత్కాలిక మరమ్మతులు చేసినా... వారి జీవితం ఎడమొహం పెడమొహమే కదా.
విభజన కూడా అంతే! నాలుగుగోడల మధ్య నడవాల్సిన చర్చ.. రోడ్డెక్కి రచ్చయ్యాక... గోల అనవసరం. భార్యభర్తలు కలిసుండగా సంపాదించుకున్న ఆస్తులేమైనా ఉంటే పంపకాలు పెద్దవాళ్లే చూస్తారు. తేడావస్తే నిలదీయడం కరెక్ట్‌,. అంతేగానీ... !